వెనుకబడిన ప్రకాశం జిల్లాను ఆదుకోవాలి .. కేంద్ర మంత్రికి లంకా దినకర్ వినతి

  • కేంద్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రూ.350 కోట్ల సాయాన్ని అందించాలన్న దినకర్
  • వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి 
  • కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందించిన దినకర్
ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించినందున, మిగిలిన వెనుకబడిన జిల్లాలకు ఏడేళ్లలో ఇచ్చిన రూ.350 కోట్ల సాయాన్ని ప్రకాశం జిల్లాకు కూడా అందించి ఆదుకోవాలని ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, బీజేపీ నేత లంకా దినకర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీలో మంత్రి నిర్మలా సీతారామన్‌ను బుధవారం కలిసిన లంకా దినకర్ .. కేంద్ర బడ్జెట్ కూర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాల్సిన నిధులపై వినతిపత్రాన్ని అందించారు. అమరావతి, పోలవరానికి కేంద్ర ఆర్ధిక సాయాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల మూలధన వ్యయం, దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాల కోసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్ల మధ్య కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన ఆయన దొనకొండ, నక్కపల్లి, ఏర్పేడు, హిందూపురంకు ఈ కేటాయింపులు అవసరమని తెలిపారు. ఏపీలో నెలకొల్పే హరిత, పునరుత్పాదక ఇంధన తయారీ సంస్థలతో పాటు ఇతర వస్తు తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలని వినతిపత్రంలో దినకర్ కోరారు. 


More Telugu News