ముంబ‌యి తీరంలో ప‌డ‌వ ప్ర‌మాదం.. 13 మంది మృతి.. మృతుల కుటుంబాల‌కు కేంద్రం ప‌రిహారం

  • అదుపు తప్పి ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొట్టిన ఇండియన్ నేవీ స్పీడ్ బోట్  
  • గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళుతుండగా ప్రమాదం
  • ఈ ప్రమాదంలో నావికాదళ అధికారి సహా 13 మంది మృతి
  • మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని మోదీ రూ.2 లక్షల చొప్పున‌ పరిహారం 
  • గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన పీఎంఓ
ముంబ‌యి తీరంలో బుధ‌వారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ట్రయల్ ర‌న్‌లో ఉన్న ఇండియన్ నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నావికాదళ అధికారి సహా 13 మంది మరణించినట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.

110 మంది ప్రయాణిస్తున్న ఫెర్రీ నుంచి ప్రమాదానికి సంబంధించిన వీడియో కెమెరాలో రికార్డ‌యింది. ప్ర‌మాద స‌మ‌యంలో నేవీ క్రాఫ్ట్‌లో ఐదుగురు ఉన్నారు. 10 మంది ఫెర్రీ ప్రయాణికులు చ‌నిపోగా, నేవీ క్రాఫ్ట్‌లోని ముగ్గురు మృతిచెందారు. మొత్తం 102 మందిని రక్షించారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ప్ర‌సిద్ధ ఎలిఫెంటా గుహల సంద‌ర్శ‌న‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

"సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంజన్ ట్రయల్స్‌లో ఉన్న నేవీ క్రాఫ్ట్ నియంత్రణ కోల్పోయి, ముంబ‌యిలోని కరంజా నుంచి ఎలిఫెంటా గుహ‌ల‌కు ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ నీల్ కమల్ అనే ఫెర్రీని ఢీకొట్టింది. ఫెర్రీ గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులను తీసుకువెళుతోంది" అని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. 

మృతుల కుటుంబాల‌కు కేంద్రం ప‌రిహారం
ప‌డ‌వ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని మోదీ రూ.2 లక్షల చొప్పున‌ పరిహారం ప్ర‌క‌టించారు. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. "ముంబయిలో జరిగిన పడవ ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే ఈ దుర్ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తీవ్ర‌ విచారం వ్య‌క్తం చేశారు. 

మృతుల కుటుంబాల‌కు మ‌హా స‌ర్కార్ రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

ఇండియన్ నేవీకి చెందిన‌ 11 నౌకాదళ పడవలు, కోస్ట్ గార్డ్ కు చెందిన ఒక ప‌డ‌వ‌, మూడు మెరైన్ పోలీసుల పడవలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు రక్షణ అధికారి ఒక‌రు తెలిపారు. అలాగే నాలుగు హెలికాప్టర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కార్మికులు, తీర ప్రాంతంలోని మత్స్యకారులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు.


More Telugu News