దేశంలోనే అతి పొడవైన యూ-గర్డర్ బెంగళూరులో ఆవిష్కరణ!

  • బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో భాగంగా ఆవిష్కరణ
  • 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఒకే విడతలో ప్రీకాస్ట్ చేసిన వైనం
  • 178 టన్నుల బరువుంటే ఈ గర్డర్ కోసం 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ వినియోగం 
దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఈ ఏడాది జనవరిలో గొల్లహళ్లిలో ఒకే విడతలో ప్రీకాస్ట్ చేయడం విశేషం. బైయప్పనళ్లి-చిక్కబనవర లైన్‌లో యశ్వంతపూర్‌లో గత రాత్రి 9.45-10 గంటల మధ్య ఆవిష్కరించినట్టు ‘కే-రైడ్’ (కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్) అధికారులు తెలిపారు.

‘యూ’ ఆకారంలో ఉన్న ఈ గర్డర్‌లను రైల్వే ఆధారిత ప్రజారవాణా ప్రాజెక్టులలో ఉపయోగిస్తుంటారు. ఇవి నాణ్యంగా ఉండటంతోపాటు నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు గరిష్ఠంగా 28 మీటర్ల యూ గర్డర్లను మాత్రమే ఉపయోగించారు. యూ గర్డర్‌కు 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ అవసరం అవుతుంది. బరువు ఏకంగా 178 టన్నులు ఉంటుంది. హెబ్బాల్-యశ్వంతపూర్ మధ్య మల్లిగే లైన్ 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్‌లో 450 యూ-గర్డర్‌లు ఉపయోగిస్తున్నారు. గొల్లహళ్లి వద్ద ఇప్పటికే 60 యూ గర్డర్లు వేశారు. కాగా, మల్లిగే లైన్‌ను డిసెంబర్ 2026 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


More Telugu News