ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే భారత్‌ను సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానించవచ్చా?

  • అనుమతిస్తున్న ఎంసీసీ రూల్స్
  • ఇన్నింగ్స్ ఆరంభానికి ముందే కెప్టెన్ తెలియజేయాలి
  • పూర్తయిన ఇన్నింగ్స్‌గా పరిగణన
  • గబ్బా టెస్టులో భారత్‌కు తప్పిన ఫాలో-ఆన్ గండం
  • మ్యాచ్ డ్రా అయ్యేందుకు అవకాశాలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. జస్ప్రీత్ బుమ్రా-ఆకాశ్ దీప్‌ జోడి భారత్‌ను ఫాలో-ఆన్‌ గండం నుంచి తప్పించింది. ఇద్దరూ కలిసి చివరి వికెట్‌కు నెలకొల్పిన 39 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్‌ను ఓటమి ముప్పు నుంచి దాదాపుగా తప్పించిందని చెప్పవచ్చు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 75వ ఓవర్‌లో ఆకాశ్ దీప్ ఫోర్ బాదడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. 

నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు 252/9గా ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు చేయడంతో టీమిండియా ఇంకో 193 పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ భారత్‌ ఫాలో-ఆన్‌ ఆడాల్సి వచ్చి ఉంటే ఆస్ట్రేలియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం మ్యాచ్ డ్రా కావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ ఫాలో-ఆన్ నుంచి తప్పించుకోవడంతో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ ఆడాల్సి ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాకు 190కి పైగా పరుగుల ఆధిక్యం ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ను వదలుకొని... భారత్‌ను సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానించవచ్చా?, నిబంధనలు ఏం చెబుతున్నాయనే ఆసక్తి నెలకొంది.

ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు ఏ సమయంలోనైనా బ్యాటింగ్‌ను వదులుకుంటున్నట్టు కెప్టెన్ చెప్పవచ్చని ఎంసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి వాటిని పూర్తయిన ఇన్నింగ్స్‌గా పరిగణిస్తారు. గబ్బా టెస్టు విషయానికి వస్తే ఆస్ట్రేలియా అంత డేరింగ్ నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆసీస్‌కు ప్రస్తుతం 190కి పైగా పరుగుల ఆధిక్యం ఉన్నప్పటికీ భారత్ ఛేదించే అవకాశాలు ఉంటాయి. బుమ్రా-ఆకాశ్ దీప్ జోడి మ్యాచ్-5వ రోజున మరో 10 పరుగులు జోడించినా లక్ష్యం మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను వదులుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.


More Telugu News