డబ్ల్యూపీఎల్ లో మన తెలుగమ్మాయి... శ్రీ చరణి వివరాలు ఇవిగో!

  • ఇటీవ‌ల బెంగళూరు వేదికగా ముగిసిన డబ్ల్యూపీఎల్ మినీ వేలం
  • రూ. 55 ల‌క్ష‌ల‌కు తెలుగమ్మాయి శ్రీ చరణిని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్
  • క‌డ‌ప జిల్లా వీర‌ప‌నేని మండ‌లం ఎర్ర‌మ‌ల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీ చ‌ర‌ణి
ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టోర్నీ వేలంలో తెలుగ‌మ్మాయి శ్రీ చ‌ర‌ణిని రూ. 55ల‌క్ష‌ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఏపీలోని క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ క్రీడాకారిణి శ్రీ చ‌ర‌ణికి భార‌త స్టార్ ప్లేయ‌ర్లతో క‌లిసి ఆడే అవ‌కాశం ద‌క్కింది. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధుల్లేవు. 

ఎవ‌రీ శ్రీ చ‌ర‌ణి..
ఏపీలోని క‌డ‌ప జిల్లా వీర‌ప‌నేని మండ‌లం ఎర్ర‌మ‌ల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీ చ‌ర‌ణి. ఆమెది ఓ సాధార‌ణ కుటుంబం. ఆమె తండ్రి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగి. ఇప్పుడు శ్రీ చ‌ర‌ణి డబ్ల్యూపీఎల్ కి ఎంపిక కావ‌డంతో పేరెంట్స్ ఆనంద ప‌డుతున్నారు. అలాగే ఆమె స్నేహితులు, బంధువులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక మెగా టోర్నీలో త‌మ ఊరి అమ్మాయి ఆడ‌నుండ‌డంపై గ్రామ‌స్తులు గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. 

ఇక ఇటీవ‌ల బెంగళూరు వేదికగా ముగిసిన డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో ఐదు ఫ్రాంచైజీల్లోని 19 స్థానాల కోసం 120 మంది పోటీపడ్డారు. ఇందులో 91 మంది భార‌త ప్లేయ‌ర్లు ఉంటే.. 29 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. ఈ వేలంలో భారత అనామక ప్లేయర్లు సిమ్రాన్ బేస్‌, 16 ఏళ్ల జి కమలిని రికార్డ్ ధర పలికారు. మహారాష్ట్రకు చెందిన బ్యాటర్ సిమ్రాన్ బేస్‌ను రూ. 1.90 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అలాగే తమిళనాడుకు చెందిన‌ వికెట్ కీపర్ క‌మ్ బ్యాట‌ర్‌ జి కమలిని ముంబ‌యి ఇండియన్స్ రూ. 1.60 కోట్లకు దక్కించుకుంది.   

కాగా, ఇప్ప‌టివ‌ర‌కు జరిగిన రెండు సీజ‌న్ల డబ్ల్యూపీఎల్ లో మొద‌టి సీజ‌న్ లో ముంబ‌యి ఇండియ‌న్స్ టైటిల్ ను ఎగ‌రేసుకుపోయింది. అలాగే గ‌తేడాది జ‌రిగిన‌ రెండో సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. 


More Telugu News