రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేనేత శాలువా బహూకరించిన మంత్రి నారా లోకేశ్

  • నేడు ఏపీకి వచ్చిన రాష్ట్రపతి ముర్ము
  • మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరు
  • మంగళగిరి చేనేత కార్మికులు రూపొందించిన శాలువా కానుకగా ఇచ్చిన లోకేశ్
  • లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపిన ముర్ము
ఏపీలో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో చేనేత పరిశ్రమను నమ్ముకుని ఎంతోమంది జీవిస్తున్నారు. అయితే, చేనేత కార్మికులు ఇప్పటికీ కష్టాల కడలిలో ఎదురీదుతుండడం పట్ల చలించిపోయిన ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చేనేతను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గతంలో ప్రధాని మోదీకి చేనేత శాలువా బహూకరించిన లోకేశ్... తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఓ చేనేత శాలువాను బహూకరించారు. 

ముర్ము నేడు ఏపీలో పర్యటించారు. మంగళగిరిలోని ప్రఖ్యాత ఎయిమ్స్ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంగళగిరి చేనేత కార్మికులు రూపొందించిన శాలువాను రాష్ట్రపతికి బహూకరించారు. ఆ శాలువాను అందుకున్న ముర్ము మురిసిపోయారు. 

శాలువాతో పాటు వెంకటేశ్వరస్వామి ప్రతిమను కూడా అందించారు. ఈ సందర్భంగా ఆమె నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దృశ్యాన్ని చిరునవ్వుతో వీక్షించారు.

లోకేశ్ మాత్రమే కాదు... లోకేశ్ అర్ధాంగి బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మంగళగిరి చీరలను ధరిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలావుండగా ప్రతిపక్షంలో ఉండగానే లోకేశ్ మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటుచేసి, ఇక్కడి చేనేతలు తయారుచేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టనేరియాతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతనావస్థకు చేరుతున్న మంగళగిరి చేనేతను పునరుజ్జీవింప జేసేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి పట్ల మంగళగిరిలోని చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News