రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై కేసులు నమోదు చేయాలి: మహేశ్వర్ రెడ్డి

  • ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదన్న మహేశ్వర్ రెడ్డి
  • ప్రజలను మోసం చేస్తున్నారని మండిపాటు
  • అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని విమర్శ
ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తయిందని... ఇప్పటికీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వాస్తవాలు తెలిసినా అధికారం కోసం తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఆరు గ్యారెంటీలను అమలు చేయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై తాము తీర్మానం ఇస్తే అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారని వెల్లడించారు. అసెంబ్లీలో మాట్లాడనీయకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు.



More Telugu News