ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన యువ రైతు నవీన్

  • పవన్ ను కలిసేందుకు ఎడ్లబండిపై బయల్దేరిన నవీన్
  • హిందూపురం నుంచి మంగళగిరి వచ్చిన వైనం
  • 27 రోజుల పాటు 760 కి.మీ పయనం
  • ఈ ఉదయం పవన్ అపాయింట్ మెంట్
రాష్ట్రంలో రైతుల పరిస్థితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకురావాలన్న యువ రైతు నవీన్ ప్రయత్నం ఫలించింది. పవన్ కల్యాణ్ ఆ రైతుకు అపాయింట్ మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ ను కలిసిన రైతు నవీన్ ఆయనకు రైతుల సమస్యలపై వినతిపత్రం అందించారు. 

నవీన్ హిందూపురం నుంచి ఎడ్లబండిపై బయల్దేరి మంగళగిరి చేరుకున్నాడు. తన ప్రయాణంలో భాగంగా ఎడ్లబండిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో రైతులను కలుస్తూ, పంట పొలాలను పరిశీలిస్తూ 27 రోజుల్లో మొత్తం 760 కిలోమీటర్లు ప్రయాణించారు. కొన్నిరోజుల కిందటే మంగళగిరి చేరుకున్నాడు. 

పవన్ ను కలిసేందుకు మంగళగిరిలో కొన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ ఉదయం జనసేనానిని కలిసిన ఆ యువ రైతు రాష్ట్రంలో రైతుల సమస్యలను ఆయనకు వివరించారు. రైతుల బాగు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 

పవన్ తో భేటీ అనంతరం యువ రైతు నవీన్ మాట్లాడుతూ, రైతుల సమస్యల పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారని వెల్లడించాడు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యంగా దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని మాటిచ్చారని నవీన్ హర్షం వ్యక్తం చేశాడు.


More Telugu News