మరో వివాదానికి తెరలేపిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ

  • బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రిస్టియన్ల భద్రతపై ప్రియాంకగాంధీ ఆందోళన
  • వారికి మద్దతుగా నిలవాలని స్లోగన్లు రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంటుకు
  • మొన్న ‘పాలస్తీన్’ అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చిన ప్రియాంక
‘పాలస్తీన్’ అని రాసి ఉన్న బ్యాగ్‌ను ధరించి పార్లమెంట్‌కు వచ్చి వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ.. ఆ మంటలు చల్లారకముందే మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడుల నేపథ్యంలో వారికి మద్దతుగా నిలవాలన్న స్లోగన్ రాసి ఉన్న బ్యాగ్‌ను ధరించి కనిపించారు. 

ప్రియాంక బ్యాగ్ స్ఫూర్తితో ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా అలాంటి బ్యాగులనే ధరించి నిరసన తెలిపారు. సోమవారం ప్రియాంక లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై గొంతెత్తాలని కోరారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రిస్టియన్ల భద్రతపై ఢాకాతో దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలని కోరారు.  

ప్రియాంకగాంధీ వరుసగా పాలస్తీన్, బంగ్లాదేశ్ పేర్లతో కూడిన బ్యాగులు ధరించి పార్లమెంటుకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రియాంక బ్యాగ్ నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దేశంలోని సమస్యల కంటే విదేశాల్లోని ఆందోళనలకే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైనా ప్రియాంక స్పందించారు. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తనకు నచ్చినవే ధరిస్తానని చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే ఈ విషయంలో తన వ్యాఖ్యలన్నీ ఇలాగే ఉండడాన్ని గమనిస్తారని పేర్కొన్నారు.  


More Telugu News