లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు.. ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ సర్కారు

  • సభలో ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్
  • 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రతిపాదించిన కేంద్రం
  • తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా కేంద్రం ప్రతిపాదించింది.

ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ విమర్శల దాడికి దిగారు. ప్రతిపాదిత బిల్లు లోక్‌సభ శాసన సామర్థ్యానికి మించినదని, దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. నియంతృత్వ పోకడకు ఈ బిల్లు నిదర్శనమని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు.

వ్యతిరేకించిన విపక్ష పార్టీలు
కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్(ఐయూఎంఎల్), శివసేన (యూబీటీ) బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  ఈ బిల్లు ఓటు హక్కుపై దాడి చేయడమేనని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ వ్యతిరేకించారు. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సమర్థించిన టీడీపీ
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామి అయిన టీడీపీ పార్టీ సమర్థించింది. లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు పార్టీ సమ్మతం తెలిపింది.


More Telugu News