తీవ్ర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవేనా?

  • భారీగా పతనమైన ఈక్విటీ మార్కెట్లు
  • సెన్సెక్స్ 944 పాయింట్లు, నిఫ్టీ 283 పాయింట్లకు పైగా పతనం
  • యూఎస్ ఫెడ్ భేటీ వేళ ప్రతికూలంగా మారిన సెంటిమెంట్
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండవ రోజైన మంగళవారం కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 944.48 పాయింట్లు (1.16 శాతం) క్షీణించి 80,803.768 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 283.95 పాయింట్లు (1.15 శాతం) పతనమై 24,405.30 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50 సూచీపై శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, టీసీఎసీ, గ్రాసిమ్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, బజాబ్ ఫిన్‌సర్వ్ షేర్లు 1.50 శాతం నుంచి 3.53 శాతం మధ్య నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక బీఎస్ఈ-30 సూచీపై 27 స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

కారణాలు ఇవేనా?
గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉండడం దేశీయ ఇనెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ రెండు రోజుల సమీక్ష సమావేశాలు ఇవాళ (మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో వేచిచూసే ధోరణిని కొనసాగించాలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను ఫెడరల్ రిజర్వ్ ప్రకటించే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లు అటువైపు చూస్తున్నాయి.

దేశీయంగా చూస్తే రూపాయి బలహీనంగా కొనసాగుతుండడం, దేశీయ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రవాహం తగ్గడం ప్రతికూల కారణాలుగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల గణాంకాలు కూడా ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.



More Telugu News