ఈవీఎం టాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ

  • ఈవీఎంలపై అనుమానం ఉంటే హ్యాక్ చేసి చూపించాలన్న టీఎంసీ ఎంపీ
  • తృణమూల్ ఆలస్యంగా నిజం తెలుసుకుందన్న బీజేపీ నేత
  • ఝార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లో కూటమి పార్టీలు విజయం సాధించాయని గుర్తు చేసిన బీజేపీ నేత
ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపణలు చేస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.  అయితే కూటమిలోని తృణమూల్ మాత్రం భిన్నంగా స్పందించింది.

ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసేవారు వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చో ఎన్నికల సంఘానికి చూపించాలని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు. కేవలం ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేత సతీష్ చంద్ర దూబే స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆలస్యంగానైనా నిజం తెలుసుకుందన్నారు. ఇటీవల జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కూటమి పార్టీలే విజయం సాధించాయని, అప్పుడు మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేయలేదన్నారు. అబద్ధాలపై పొత్తు ఎక్కువ కాలం నిలబడదని వ్యాఖ్యానించారు.

అంతకుముందు, జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో వందమందికి పైగా ఆయా పార్టీల సభ్యులు అవే ఈవీఎంలతో గెలిచినప్పుడు దానిని ఘనవిజయంగా తీసుకున్నారని, కొన్ని నెలల తర్వాత వారు అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఈవీఎంలు హ్యాక్ అంటున్నారని విమర్శించారు. పక్షపాతంతో కాకుండా సిద్ధాంతాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానన్నారు.

ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చురక అంటించారు. ఈవీఎంలతో సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలన్నారు. కానీ ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదన్నారు. ప్రజలు ఓసారి మనల్ని ఎన్నుకుంటారు... మరోసారి ఎన్నుకోకుండా ఉంటారని, ఇందుకు తానే ఉదాహరణ అన్నారు. మెషీన్లను మాత్రం తాను ఎప్పుడూ విమర్శించలేదన్నారు.


More Telugu News