రైతుకు బేడీలు వేసిన ఘటనపై సభలో చర్చ జరగాల్సిందే: హరీశ్ రావు

  • సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని అడిగామన్న హరీశ్ రావు
  • రేపు లగచర్ల అంశంపై సభలో చర్చించాలని కోరినట్లు చెప్పిన మాజీ మంత్రి
  • బీఏసీలో చర్చించకుండా సభలో బిల్లులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశామన్న హరీశ్ రావు
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని తాము బీఏసీలో అడిగామని, కానీ ఎన్ని రోజులు నడుపుతామనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదని, దీంతో తాము వాకౌట్ చేశామన్నారు. రేపు లగచర్ల అంశంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. చర్చ చేపట్టినప్పుడు ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశమివ్వడం సంప్రదాయమన్నారు.

లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటన చాలా తీవ్రమైనదని తాము బీఏసీలో చెప్పామన్నారు. ఈ అంశంపై చర్చకు అవకాశమివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బీఏసీ చెప్పినట్లే సభ నడుస్తుందని తాము చెప్పామన్నారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని బీఏసీలో కోరినట్లు తెలిపారు.

బీఏసీలో చర్చించకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. పుట్టిన రోజులు, పెళ్లిళ్లు ఉన్నాయంటూ సభను వాయిదా వేయడంపై కూడా తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయం అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ వెలుపల ప్రకటన చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ప్రతిరోజు జీరో అవర్ ఉండాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.


More Telugu News