ఒకే ఏడాది రెండు ట్రోఫీలు.. ఒకే ఒక్కడిగా శ్రేయాస్ అయ్యర్ రికార్డు

  • ఐపీఎల్‌లో కోల్‌కతాకు, ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ట్రోఫీలు అందించిన శ్రేయాస్
  • ఆ ఘనత సాధించిన ఒక్కే ఒక్క ఆటగాడిగా రికార్డు
  • ఐపీఎల్‌లో మూడు జట్లకు సారథ్యం వహించిన మూడో ఆటగాడిగా మరో రికార్డు
టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అత్యంత అరుదైన రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథ్యం వహించిన శ్రేయాస్ ఆ జట్టుకు టైటిల్ అందించి పెట్టాడు. తాజాగా నిన్న మరో ఘనత సాధించాడు. 2024-25లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (ఎస్ఎం‌టీఏ)లో ముంబైకి సారథ్యం వహించిన అయ్యర్.. జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విజయం సాధించిన ముంబై ట్రోఫీని చేజిక్కించుకుంది. ముంబైకి ట్రోఫీ అందించడం ద్వారా శ్రేయాస్ అయ్యర్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కెప్టెన్‌గా ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను అందుకున్న తొలి కెప్టెన్‌గా శ్రేయాస్ రికార్డులకెక్కాడు. అంతేకాదు, ఈ రెండింటినీ ఒకే ఏడాది అందుకోవడం మరో విశేషం. 
49.28 సగటుతో 345 పరుగులు సాధించిన శ్రేయాస్ ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగవ ఆటగాడిగా నిలిచాడు.

మరో ఘనత కూడా..
30 ఏళ్ల శ్రేయాస్ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ ఈ ఏడాది టైటిల్ అందించినప్పటికీ జట్టు అతడిని రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇటీవల జరిగిన మెగా వేలంలో పంజాబ్ జట్టు అతడిని రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఇది రెండో అత్యధిక ధర.- కాగా, ఐపీఎల్‌లో మూడు జట్లకు సారథ్యం వహించిన తొలి ఆటగాడు కూడా శ్రేయాసే. గతంలో ఢిల్లీ డేర్ కేపిటల్స్‌కు సారథ్యం వహించిన అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను నడిపించాడు. వచ్చే సీజన్‌లో పంజాబ్‌ జట్టును నడిపించబోతున్నాడు.


More Telugu News