హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తో మంచు విష్ణు జాయింట్ వెంచర్...?

  • తరంగ వెంచర్స్ పేరుతో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ రంగంలోకి అడుగు పెడుతున్న నటుడు మంచు విష్ణు
  • 50 మిలియన్ డాలర్ల నిధులతో సంస్థ ఏర్పాటు
  • హాలీవుడ్ నటుడు విల్‌ స్మిత్ కూడా భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారన్న విష్ణు
నటుడు, నిర్మాత, విద్యా సంస్థల నిర్వాహకుడుగా రాణిస్తున్న మంచు విష్ణు మరో కీలక రంగంలోకి అడుగు పెడుతున్నారు. తరంగ వెంచర్స్ పేరుతో ఆయన మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. 50 మిలియన్ డాలర్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థలో హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్‌ స్మిత్ కూడా భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నట్లు విష్ణు తెలిపారు. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విష్ణు చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారని ఆయన పేర్కొన్నారు.  
 
తరంగ వెంచర్స్‌లో మంచు విష్ణుతో పాటు దశాబ్దాల అనుభవం ఉన్న ఆర్ధిక నిపుణురాలు అదిశ్రీ, రియల్ ఎస్టేట్ అండ్ పెన్షన్ ఫండ్స్‌లో కెనెడియన్ పెట్టుబడిదారు ప్రద్యుమన్ ఝలా, భారతీయ మీడియాలో అనుభవజ్ఞుడు వినయ్ మహేశ్వరి, హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, పెట్టుబడిదారుల సంబంధాలు మరియు ఫండ్ కార్యకలాపాలలో నిపుణుడైన దినేశ్ చావ్లా, సతీశ్ కటారియా భాగస్వాములుగా ఉండనున్నారు. వీరే కాకుండా మరి కొందరు కూడా తరంగ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇటు భారత్, అటు డెలవర్‌లోనూ ఆసక్తి చూపుతున్నారు. 
 
తరంగ వెంచర్స్ ముఖ్యంగా ఇండస్ట్రీకి అవసరమయ్యే నూతన టెక్నాలజీస్‌పై పెట్టుబడులు పెట్టనుంది. ఓటీటీ వేదికలు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, విఆర్, ఏఇ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. వినోద రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోనుంది.   

భవిష్యత్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో విప్లవాత్మకంగా అడుగులు వేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విష్ణు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సృజనాత్మక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. 


More Telugu News