ప్రారంభమైన మూడో టెస్ట్.. అంతలోనే ఆగిన మ్యాచ్!

  • 13.2 ఓవర్ల వద్ద ప్రారంభమైన వర్షం
  • అప్పటికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసిన ఆసీస్
  • రెండు మార్పులతో భారత్, ఒకే ఒక్క మార్పుతో ఆసీస్ బరిలోకి
  • ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చెరో విజయం సాధించిన ఇరు జట్లు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ప్రారంభమైన మూడో టెస్టుకు వరుడు అడ్డం పడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. సరిగ్గా 13.2 ఓవర్ల వద్ద వర్షం పడడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖావాజా (19), నాథన్ మెక్‌స్వీనీ (4) క్రీజులో ఉన్నారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో లంచ్ బ్రేక్ ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా జట్టులో ఒకే ఒక్క మార్పు చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి జోష్ హేజెల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఇండియా 296 పరుగులతో విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది.


More Telugu News