ఇంతకీ గుకేశ్ తెలుగువాడా? తమిళియనా?.. క్రెడిట్ కోసం చంద్రబాబు, స్టాలిన్ మధ్య పోరు!

  • అతడు ఏ రాష్ట్రం వాడన్నదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
  • రెండు నిమిషాల తేడాతో స్టాలిన్, చంద్రబాబు పోస్టులు
  • నెటిజన్లలో ఎక్కువమంది తమిళియన్ అన్న వాదనను సమర్థిస్తున్న వైనం
  • అతడి మూలాలను వెతకడంపై మరో యూజర్ ఆశ్చర్యం
  • అతడు భారతీయుడంటూ చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టే యత్నం
గుకేశ్ దొమ్మరాజు.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన గుకేశ్.. 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఆ ఘనత సాధించిన రికార్డును తన పేరున రాసుకున్నాడు. క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖుల నుంచి గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో అతడు తెలుగువాడా? తమిళియనా? అన్న చర్చ మొదలైంది. 

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎవరికి వారే అతడు తమ వాడని చెప్పుకోవడమే అందుకు కారణం. గుకేశ్ టైటిల్ సాధించగానే ఎక్స్‌ వేదికగా  స్టాలిన్ స్పందిస్తూ.. గుకేశ్ అద్భుత విజయాన్ని ప్రశంసించారు. మరో చాంపియన్‌ను తయారు చేయడం ద్వారా ప్రపంచ చెస్‌ క్యాపిటల్‌గా చెన్నై తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. గుకేశ్‌ను చూసి తమిళనాడు గర్విస్తోందంటూ అతడి మెడలో బంగారు పతకం వేస్తున్న పాత ఫొటోను పంచుకున్నారు. 

స్టాలిన్ సాయంత్రం 7.25 గంటల సమయంలో ఎక్స్‌లో స్పందించగా ఆ తర్వాత రెండు నిమిషాలకే చంద్రబాబు కూడా స్పందించారు. ‘మా సొంత తెలుగు బిడ్డకు హృదయపూర్వక అభినందనలు’’ అని రాసుకొచ్చారు. 18 ఏళ్ల వయసులోనే ఇండియన్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన గుకేశ్‌కు అభినందనలు అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ అద్వితీయ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోందని తెలిపారు.

ఇంతకీ గుకేశ్ ఎవరు?
గుకేశ్‌లో తెలుగు మూలాలు ఉన్నప్పటికీ అతడు పుట్టింది, పెరిగిందీ చెన్నైలోనే. తల్లిదండ్రులిద్దరూ మెడికల్ ప్రొఫెషనల్సే. చంద్రబాబు, స్టాలిన్ పోస్టుల తర్వాత గుకేశ్ తెలుగువాడా? తమిళనాడుకు చెందినవాడా? అన్న చర్చ సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది. గుకేశ్‌కు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించిన విషయాన్ని చాలామంది గుర్తుచేశారు. ఈ చెస్ స్టార్‌కు స్టాలిన్ ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ. 75 లక్షలు సాయం చేసినప్పటి స్క్రీన్ షాట్లను పంచుకుంటున్నారు.

తెలుగు గ్రాండ్ మాస్టర్ అయిన గుకేశ్ దొమ్మరాజు కెరియర్‌‌కు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడతడు తమవాడేనని తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవడం ప్రారంభించాలని ఓ యూజర్ ఎద్దేవా చేశాడు. గుకేశ్ విషయంలో తమిళనాడు వాదనను ఎక్కువమంది యూజర్లు సమర్థిస్తున్నారు. తమిళనాడు చెస్ సంస్కృతి, మౌలిక సదుపాయాలు అతడి విజయానికి కీలకంగా నిలిచాయని మరో యూజర్ పేర్కొన్నాడు. ఇప్పుడు మరో రాష్ట్రం ఆ క్రెడిట్‌ను కొట్టేయాలని చూస్తోందని విమర్శించాడు. నిజానికి అతడు ఏ రాష్ట్రం వాడన్నది ముఖ్యం కాదని, అతడు భారతీయుడని మరో యూజర్ పేర్కొన్నాడు. దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో అతడి పూర్వీకులు, కులాన్ని కనుగొనడం హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.  


More Telugu News