తమిళనాడు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

  • దిండిగల్ జిల్లా గాంధీనగర్ ప్రాంతంలో ఘటన
  • మృతుల్లో ఓ బాలుడు కూడా.. మరో 30 మందికి గాయాలు
  • ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని నిర్ధారణ
తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిండిగల్ జిల్లా గాంధీనగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి. ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులను రక్షించి పది అంబులెన్సులలో ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

లిఫ్ట్‌లో స్పృహ కోల్పోయిన స్థితిలో పడివున్న ఆరుగురుని రక్షించిన రెస్క్యూ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పొగతో ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మెడికల్ ఫెసిలిటీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News