నిఖేశ్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నీటిపారుదల శాఖ ఏఈఈ
  • చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలింపు
  • నిఖేశ్‌ను నాలుగు రోజుల పాటు విచారించనున్న పోలీసులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అధికారులు అతనిని నాలుగు రోజుల పాటు విచారిస్తారు. నిఖేశ్ కుమార్ సమక్షంలో బ్యాంకు లాకర్లు తెరవనున్నారు.

నిఖేశ్ కుమార్ బినామీ ఆస్తుల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. అతని స్నేహితుల బ్యాంకు లాకర్ ఓపెన్ చేసి భారీగా బంగారంతో పాటు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నిఖేశ్ కుమార్ నీటిపారుదల శాఖలో ఏఈఈగా పని చేస్తున్నాడు. అతను ఇటీవల ఏసీబీకి చిక్కాడు. నిఖేశ్ కుమార్ ఇల్లు, అతని స్నేహితుల ఇళ్లలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 17.73 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. ఒక లాకర్‌లో మరో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.


More Telugu News