ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్న తొలి నాన్‌స్టాప్ విమానం.. వాటర్ కేనన్స్‌తో సిబ్బంది స్వాగతం

  • ఢిల్లీ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్
  • విమానంలో రాజమండ్రి చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్
  • దేశంలోని ప్రధాన నగరాలతో రాజమండ్రి అనుసంధానమైందన్న రామ్మోహన్‌నాయుడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ డైరెక్ట్ ఫ్లైట్‌లో రాజమండ్రి చేరుకున్నారు. 

విమానాశ్రయ సిబ్బంది వాటర్ కేనన్స్‌తో విమానానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైనట్టు చెప్పారు. ఇకపై మరిన్ని విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి తిరుపతి, షిర్డీ, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పురందేశ్వరి తెలిపారు. కాగా, ఢిల్లీ నుంచి ప్రతి రోజు రాజమండ్రికి నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఇండిగో తెలిపింది.


More Telugu News