జగన్మాత ప్రత్యక్షం కాలేదని ప్రాణాలు తీసుకున్న వ్యక్తి

  • జగన్మాత సాక్షాత్కారం కోసం అమిత్ శర్మ 24 గంటల తపస్సు
  • అనుగ్రహించకపోవడంతో కత్తితో గొంతు కోసుకున్న అమిత్ శర్మ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైనం
జగన్మాత అనుగ్రహం కలగలేదని ఓ మూఢ భక్తుడు కత్తితో గొంతు కోసుకుని మృతి చెందాడు. ఈ ఘటన వారణాసిలో తాజాగా వెలుగు చూసింది. గాయ్‌ఘాట్ పతంగలి ప్రాంతంలో ఉండే అమిత్ శర్మ కత్తితో తన గొంతు కోసుకోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.  
 
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇషాన్ సోనీ తెలిపిన వివరాల ప్రకారం.. కాళీ మాత అంటే అమితమైన భక్తి ఉన్న అమిత్ శర్మ జగన్మాత ప్రత్యక్షం కోసం తన గదిలో శనివారం తపస్సు ప్రారంభించాడు. కాళీమాత తన ముందు ప్రత్యక్షం అవుతుందని అతను చెప్పాడట. తల్లీ .. ప్రత్యక్షం అవ్వు.. అంటూ ధ్యానం సందర్భంలో అతను ఉచ్చరించాడట. అయితే.. ఎన్ని గంటలు గడచినా జగన్మాత ప్రత్యక్షం కాకపోవడంతో నిరాశకు గురైన అతను చివరకు కత్తితో తన గొంతు కోసుకున్నాడని అసిస్టెంట్ కమిషనర్ ఇషాన్ సోనీ తెలిపారు.  
 
అమిత్ శర్మ గత ఏడేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడని ఇంటి యజమాని తెలిపాడు. తరచూ అతను తీర్ధ యాత్రలకు వెళ్లేవాడని, ఇక్కడి విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించే వాడని పేర్కొన్నాడు. కాగా, అమిత్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


More Telugu News