ఏపీలో హెల్మెట్ల నిబంధనలు అమలు కాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి

  • ద్విచక్రవాహనదారులు రోడ్డెక్కితే హెల్మెట్ తప్పనిసరి
  • ఏపీలో ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న హైకోర్టు
  • జరిమానాలు వేసినా చెల్లించడంలేదన్న పోలీసుల తరఫు న్యాయవాది
ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైకి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. అయితే ఏపీలో ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని తాండవ యోగేశ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. 

హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే, ఆ బాధ్యత ఎవరిదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించడంలేదని న్యాయమూర్తి అడిగారు. అందుకు పోలీసుల తరఫు న్యాయవాది బదులిస్తూ... ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో 8 వేల మంది సిబ్బంది అవసరమని, కానీ 1,800 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నా, వారు ఆ జరిమానాలు చెల్లించడంలేదని తెలిపారు. 

అనంతరం, ఏపీ హైకోర్టు... ఈ వ్యవహారంలో సుమోటోగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ను ఆదేశించింది. అంతేకాదు, వారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

కాగా, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో హెల్మెట్ ధరించని వ్యక్తులు 677 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకు హైకోర్టు స్పందిస్తూ... హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం సహించరాదని పేర్కొంది. 

అంతేకాదు, ఏపీ హైకోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేసింది. కార్లలో ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు తెలంగాణ సరిహద్దులకు చేరుకున్న తర్వాతే  సీట్ బెల్టులు పెట్టుకుంటున్నారని... దీన్నిబట్టే ఏపీలో రోడ్డు రవాణా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో చెప్పవచ్చని వ్యాఖ్యానించింది.


More Telugu News