గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2024‘ విడుదల... మొదటి స్థానంలో వినేశ్ ఫొగాట్... పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

  • రెండోస్థానంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్
  • నాలుగో స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
  • ఐదో స్థానంలో పవన్ కల్యాణ్... మోడల్ పూనం పాండేకు ఏడోస్థానం
రాజకీయ రంగంలోకి ప్రవేశించి తొలిసారే సత్తా చాటిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ గురించి ఈ ఏడాది గూగుల్‌లో తెగ వెతికేశారట. ఈ మేరకు గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2024’ రిపోర్టు వెల్లడించింది. బీజేపీ నేత, ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్ అప్పటి చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది సహ ఒలింపియన్లు అయిన సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో కలిసి ఫొగాట్ ఆందోళనకు దిగారు. 

ఈ ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఫొగట్ ఫైనల్‌కు చేరుకున్నా అధిక బరువు కారణంగా బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆబ్రిట్రేషన్‌లో ఫొగాట్ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పారిస్ నుంచి భారత్ చేరుకున్న తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో హర్యానా నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పటికీ జులానా స్థానం నుంచి పోటీ చేసిన ఫొగాట్ మాత్రం విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఎక్కువమంది గూగుల్‌లో ఫొగాట్ గురించి సెర్చ్ చేశారు.

ఇక, గూగుల్‌లో అత్యధికమంది వెతికిన వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండోస్థానంలో ఉన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏతో నితీశ్ కుమార్ మళ్లీ చేతులు కలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ జేడీయూ 12 స్థానాలు సాధించి కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారింది. ఆ తర్వాతి స్థానంలో లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో నిలిచాడు. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో పాండ్యా చివరి ఓవర్ వేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శశాంక్ సింగ్ (క్రికెటర్), పూనం పాండే (మోడల్), రాధిక మర్చంట్ (వ్యాపారవేత్త), అభిషేక్ శర్మ (క్రికెటర్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్ ఆటగాడు) ఉన్నారు. 


More Telugu News