అమెరికాతో 553 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఉపసంహరించుకున్న అదానీ పోర్ట్స్

అమెరికాతో 553 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఉపసంహరించుకున్న అదానీ పోర్ట్స్
  • కొలంబోలో పోర్టు అభివృద్ధికి డీఎఫ్‌సీతో 553 మిలియన్ డాలర్ల ఒప్పందం
  • ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన అదానీ పోర్ట్స్
  • కంపెనీ మూలధనం, రాబడి నుంచి పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం
అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ)తో కుదుర్చుకున్న 553 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని భారత బిలియనీర్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజడ్) లిమిటెడ్ ఉపసంహరించుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఓడ రేవు అభివృద్ధికి గాను ఈ రుణం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇప్పుడీ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గినట్టు సోమవారం రాత్రి ఏపీఎస్‌ఈజడ్ ఫైలింగ్‌ను బట్టి తెలిసింది. రుణ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గిన నేపథ్యంలో కంపెనీ తన ఆదాయం, ఇతర మూలాల నుంచి వచ్చిన డబ్బు, మూలధనం నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.  

కాగా, అదానీపై ఇటీవల అమెరికాలో తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. సోలార్ ప్రాజెక్టుల కోసం భారత్‌లో ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకు అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి 265 మిలియన్ డాలర్లు సేకరించినట్టు కేసు నమోదైంది. అయితే, అమెరికా ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపడేసింది. అదానీ ప్రస్తుతం ఆసియా కుబేరుల్లో రెండోస్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. 


More Telugu News