నా కోసం వచ్చిన జ‌ర్న‌లిస్టుల‌కు ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రం.. సారీ: క‌న్నీరు పెట్టుకున్న‌ మంచు మ‌నోజ్

  • కుటుంబంలో జ‌ర‌గుతున్న వివాదం నేప‌థ్యంలో మంచు మ‌నోజ్ తీవ్ర భావోద్వేగం
  • ఇలాంటి రోజు వ‌స్తుంద‌నుకోలేదంటూ ఎమోష‌న‌ల్‌
  • జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఎప్పుడూ తోడు ఉంటాన‌న్న‌ మ‌నోజ్
  • త‌న తండ్రి మోహ‌న్ బాబు, అన్న విష్ణు త‌ర‌ఫున జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణలు
  • మా నాన్న దేవుడు.. కానీ ఈరోజు చూస్తున్న‌ది ఆయ‌న‌ను కాద‌ని వ్యాఖ్య‌ 
త‌న కుటుంబంలో జ‌రు‌గుతున్న వివాదం నేప‌థ్యంలో హీరో మంచు మ‌నోజ్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి మోహ‌న్ బాబు, అన్న విష్ణు త‌ర‌ఫున జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. ఇలాంటి రోజు వ‌స్తుంద‌నుకోలేద‌ని, త‌న కోసం వ‌చ్చిన జ‌ర్న‌లిస్టుల‌కు ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఎప్పుడూ తోడు ఉంటాన‌ని మ‌నోజ్ అన్నారు. 

"ఆస్తి కోసం నాన్న‌తో గొడ‌వ ప‌డుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాదు. నా కుటుంబ స‌భ్యుల‌ను ఏమీ అడ‌గ‌లేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధార‌ప‌డలేదు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడిగింది లేదు. సొంతంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటున్నాను. సొంత‌కాళ్ల‌పై బ‌తుకుతున్నాను. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెల‌ల కూతురును కూడా లాగుతున్నారు" అంటూ మ‌నోజ్ క‌న్నీరు పెట్టుకున్నారు.  

"మా నాన్న దేవుడు. కానీ, ఈరోజు చూస్తున్న‌ది మా నాన్నను కాదు. వేరేవాళ్లు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. నేను ఎవ‌రిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజీ చూపించండి. నేను ఇవాళ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాను. మిగ‌తా విష‌యాలు పోలీసుల విచార‌ణ త‌ర్వాత వెల్ల‌డిస్తా" అని మ‌నోజ్ చెప్పుకొచ్చారు.  


More Telugu News