పుష్ప-2 కలెక్షన్ల సునామీ.. సంచలన రికార్డు!

  • అన్ని వెర్షన్లలో భారీ వసూళ్లు రాబడుతున్న మూవీ
  • నేడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
  • అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమాగా అవతరించే ఛాన్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన తారాగణంతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2: ది రూల్’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని వెర్షన్లలోనూ దూసుకెళుతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌ రాష్ట్రాలలో భారీ వసూళ్లు రాబడుతోంది. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లోనే అధిక కలెక్షన్లు వస్తున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప-2 రికార్డు మైలురాయిని అందుకోబోతోంది. రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతోందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారం రోజుల్లోనే ఈ మైలురాయిని సాధించిన భారతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయం.

మూవీ కలెక్షన్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘శాక్‌నిల్క్’ ప్రకారం పుష్ప-2 మంగళవారం రూ. 52.50 కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వెర్షన్‌లో రూ. 38 కోట్లు, తెలుగులో రూ. 11 కోట్లు, తమిళంలో రూ. 2.60 కోట్లు రాబట్టింది. నేడు (బుధవారం) కూడా ఇదే స్థాయిలో రాణిస్తే రికార్డు నెలకొల్పడం ఖాయంగా ఉంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.900 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.922 కోట్లు వసూలు చేసిందని ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధికారికంగా ప్రకటించారు.


More Telugu News