వాడెవ‌డో చంద‌నం దుంగ‌ల దొంగ‌... వాడు హీరో...!: రాజేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

  • 'హ‌రిక‌థ' వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌ట కిరీటి సంచ‌ల‌న కామెంట్స్‌
  • ఇటీవ‌ల హీరోలకు అర్థాలు మారిపోయాయ‌న్న రాజేంద్ర ప్ర‌సాద్‌
  • 'పుష్ప‌-2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్ర‌సాద్ ఈ కామెంట్స్ చేశారంటున్న నెటిజ‌న్లు
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న న‌టించిన వెబ్ సిరీస్ 'హ‌రిక‌థ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో న‌ట కిరీటి మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.  

"ఈ క‌లియుగంలో వ‌స్తున్న సినిమాలు, వాటి క‌థ‌లను మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం. వాడెవ‌డో చంద‌నం దుంగ‌ల దొంగ‌... వాడు హీరో. ఇటీవ‌ల హీరో పాత్రలకు అర్థాలు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే... నేను 48 ఏళ్లుగా స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న‌టువంటి క్యారెక్ట‌ర్స్‌తోనే విలక్షణ హీరో అనిపించుకున్నాను" అని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. 

ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన 'పుష్ప‌-2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్ర‌సాద్ ఈ కామెంట్స్ చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఇక 'హ‌రిక‌థ' వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ్యాగీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌తో పాటు హీరో శ్రీరామ్‌, పూజిత పొన్నాడ‌, దివి, అర్జున్ అంబ‌టి, మౌనిక రెడ్డి త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు.


More Telugu News