బంగ్లాదేశ్ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ

  • విదేశీ శక్తులు ఆక్రమిస్తే భారతీయులు లాలీపాప్ తింటూ కూర్చుంటారా? అని చురక
  • కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా బెంగాల్ కట్టుబడి ఉంటుందని వ్యాఖ్య
  • రెచ్చగొట్టే ప్రకటనలకు స్పందించాల్సిన అవసరం లేదన్న మమత
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమకు హక్కు ఉందంటూ బంగ్లాదేశ్ నేతలు చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విదేశీ శక్తులు ఆక్రమిస్తే భారతీయులేమైనా లాలీపాప్ తింటూ కూర్చుంటారా? అని చురక అంటించారు. ఇలాంటి వ్యవహారాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పశ్చిమ బెంగాల్ కట్టుబడి ఉంటుందన్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌లో కొందరు చేసే రెచ్చగొట్టే ప్రకటనలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నారని, అనవసరంగా ఇక్కడి వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు.

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతోన్న దాడులు, అక్కడి నేతల వ్యాఖ్యలను బెంగాల్‌లోని ఇమామ్‌లు కూడా ఖండిస్తున్నట్లు చెప్పారు. అక్కడ పరిస్థితులు మరింత దిగజారితే అక్కడి మన బంధువులు, మిత్రులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఏదైనా మాట్లాడితే సంయమనం పాటించాలన్నారు. పరిస్థితులు దిగజారకుండా చూడాలన్నారు.

పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమ దేశానికి హక్కులు ఉన్నాయని ఇటీవల ఢాకాలో ఏర్పాటు చేసిన సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.


More Telugu News