నాకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించారు: జానీ మాస్టర్

  • డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు
  • నూతన అధ్యక్షుడి ఎన్నిక
  • జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించినట్టు వార్తలు
  • తన పదవీకాలం ఇంకా ఉందన్న జానీ మాస్టర్
  • కోర్టులోనే తేల్చుకుంటానని హెచ్చరిక 
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, జైలుపాలై, ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వార్తల్లోకెక్కారు. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయని, ఈ సంఘానికి నూతన అధ్యక్షుడు ఎన్నికవగా, జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, జానీ మాస్టర్ స్పందించారు. తనను యూనియన్ నుంచి తొలగించినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని, ఆరోపణల కారణంగా తనను యూనియన్ నుంచి తొలగించారని ప్రచారం చేస్తున్నారని వివరించారు. 

యూనియన్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ఇంకా ఉందని, కానీ తనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించారని జానీ మాస్టర్ ఆరోపించారు. అనధికారికంగా నిర్వహించిన ఎన్నికలు చెల్లవని... యూనియన్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. యూనియన్ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని హెచ్చరించారు.


More Telugu News