ఆ సినిమా వలన 14 కోట్లు పోయాయి: నిర్మాత బెల్లంకొండ సురేష్

  • అప్పట్లో 'ఆది' సినిమా పెద్ద హిట్టన్న నిర్మాత 
  • 100 సెంటర్లలో 100 రోజులు ఆడిందని వివరణ 
  • 'రభస' వలన భారీ నష్టం వచ్చిందని వెల్లడి 
  • ఆ డబ్బింగ్ సినిమాల వలన 20 కోట్లు పోయాయని వ్యాఖ్య

నిర్మాతగా బెల్లంకొండ సురేష్ నుంచి ఎన్నో భారీ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో కొన్ని సంచలన విజయాలను సాధిస్తే, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. తాజాగా 'వన్ ఇండియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

"నేను ఒక సినిమా తీయాలనుకుని రంగంలోకి దిగితే, ఇక ఆ ప్రాజెక్టు విషయంలో కాంప్రమైజ్ కాను. 'ఆది' సినిమా విషయంలోనూ అలాగే చేశాను. అప్పటి మార్కెట్ ను బట్టి చూసుకుంటే, 'ఆది' సినిమాకి రెట్టింపు ఖర్చు పెట్టాను. ఆ సినిమా పూర్తయ్యే సమయానికి 14 కోట్లు పెట్టాను. నేను ఊహించినట్టుగానే అది 100 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఎన్టీఆర్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది" అని అన్నారు. 

"ఆ తరువాత ఎన్టీఆర్ తో 14 కోట్లతో 'రభస' సినిమా తీశాను. అనేక కారణాల వలన ఆ సినిమా అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం... సరిగ్గా ఆడకపోవడం... వడ్డీలు పెరిగిపోవడం వలన 14 కోట్లు పోయాయి. అప్పట్లో నాకు జరిగిన పెద్ద నష్టం అది. ఆ తరువాత చేసిన డబ్బింగ్ సినిమాలు బ్రదర్స్, శకుని, గజరాజు వలన 20 కోట్లు పోయాయి. దాంతో ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చేశాను. అక్కడి నుంచి కొత్తగా మళ్లీ లైఫ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది" అని చెప్పారు. 



More Telugu News