సంధ్య థియేటర్ ఘటనపై ఆర్జీవీ ఏమన్నారంటే..!

  • అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం హాస్యాస్పదమన్న వర్మ
  • తొక్కిసలాట ఘటనలు సాధారణమని, ఇదే మొదటిది కాదని వ్యాఖ్య
  • బెనిఫిట్ షోలు రద్దు చేయడం సరికాదని వెల్లడి
పుష్ప- 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని ప్రకటించింది. ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. మృతురాలి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేయడంతో పాటు రూ.25 లక్షలు అందజేస్తానని వెల్లడించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా స్పందించారు.

ఈ ఘటనకు అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదమని, బెనిఫిట్ షోలకు స్టార్లను రావొద్దనడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం.. యాక్సిడెంట్లు జరుగుతాయనే కారణంతో రోడ్లపై ట్రాఫిక్ ను నిషేధించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో జనం గుమిగూడిన సందర్భాలలో తొక్కిసలాటలు జరగడం సాధారణమేనని, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మొదటిది కాదని చెప్పారు. గడిచిన దశాబ్దంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు, అందులో పదులు, వందలు, వేల సంఖ్యలో జనం చనిపోయిన ఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ చూడండి అంటూ వికీపీడియా లింక్ ఇచ్చారు. 

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు కారణమేంటనేది పోలీసుల విచారణలో బయటపడుతుందని, ఇందులో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే వారిని అరెస్టు చేయడం సమంజసమేనని వర్మ పేర్కొన్నారు. అంతేకానీ, అల్లు అర్జున్ ను దీనికి బాధ్యుడిని చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బెనిఫిట్ షో కు వర్మ అర్థం చెప్పారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడో, మరేదైనా కారణంతో విరాళాలు అందించేందుకో ప్రత్యేకంగా షోలు ప్రదర్శించే వారని చెప్పారు. ఈ షోలతో వచ్చిన సొమ్మును విరాళంగా అందించే వారని గుర్తుచేశారు.

ప్రస్తుతం బెనిఫిట్ షోల ప్రదర్శనకు ముఖ్య కారణం ఆ సినిమాపై ఉన్న హైప్ ను, ప్రేక్షకుల క్రేజ్ ను సొమ్ము చేసుకోవడమేనని వివరించారు. ఈ బెనిఫిట్ షోలతో ఇతరులకు ప్రయోజనం లేదని, వీటిని బెనిఫిట్ షోలు అనడం కన్నా స్పెషల్ షోలని పిలవడం కరెక్ట్ అని అన్నారు. సాధారణ టీ, సాధారణ భోజనంతో పోలిస్తే స్పెషల్ టీ, స్పెషల్ మీల్స్ ను కొంత ప్రత్యేకంగా తయారుచేసిస్తారు కాబట్టి వాటి ధర ఎక్కువని చెప్పారు. అదేవిధంగా, రిలీజ్ కన్నా ముందే కొంతమందికి ప్రత్యేకంగా సినిమా చూసే అవకాశం కల్పించే షో కాబట్టి స్పెషల్ షోల టికెట్ ధరలు కూడా పెంచుకోవచ్చని ఆర్జీవీ వివరించారు.


More Telugu News