సిరియాలో అంతర్యుద్ధం.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్

  • రాజధాని డమాస్కస్‌లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు
  • గుర్తుతెలియని ప్రాంతానికి పరారైన అధ్యక్షుడు
  • అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని జలాలి ప్రకటన
సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల రాజధాని డమాస్కస్‌ నగరంలోకి ప్రవేశించాయి. దీంతో బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించడానికి ముందే ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో గత 24 ఏళ్లుగా సిరియాలో అసద్ పాలనకు, 50 ఏళ్లుగా సాగుతున్న అతడి కుటుంబ పాలనకు ముగింపు పడింది.

అధికార మార్పిడికి సిద్ధం: ప్రధాని జలాలి
తిరుగుబాటు దళాలకు శాంతియుతంగా అధికార మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలి ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘‘ ప్రభుత్వ కార్యకలాపాలను ప్రతిపక్షానికి అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను నా ఇంట్లో ఉన్నాను. నేను దేశాన్ని విడిచిపెట్టలేదు. నేను ఈ దేశానికి చెందినవాడిని’’ అని జలాలి ప్రకటించారు. విధులు నిర్వర్తించడానికి ఉదయాన్నే ఆఫీస్‌కు వెళతానని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయవద్దని సిరియా పౌరులకు ఆయన పిలుపునిచ్చారు. అయితే, అధ్యక్షుడు బషర్ అసద్ దేశం విడిచి వెళ్లినట్లు  వెలువడుతున్న కథనాలపై ఆయన స్పందించలేదు. కాగా తిరుగుబాటు గ్రూపుల బలగాలు కీలకమైన నగరాలను ఆక్రమించుకుంటూ క్రమంగా రాజధానిలోకి అడుగుపెట్టాయి. ఈ దళాలకు టర్కీ మద్దతు ఉన్న విషయం తెలిసిందే.


More Telugu News