ఇదేమీ జోక్ కాదు... మ్యాజిక్ కాదు: మంత్రి నారా లోకేశ్

  • ఆంధ్రా యూనివర్సిటీ అలూమ్ని కార్యక్రమంలో నారా లోకేశ్ స్పీచ్
  • మాతృ సంస్థ రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు కదిలి రావాలని పిలుపు
  • ఆంధ్రా యూనివర్సిటీ పూర్వవైభవానికి సహకరించాలని సూచన
రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్–3లో, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వార్షిక అలూమ్ని మీట్ ను విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ గౌరవ అతిథిగా హాజరు కాగా... ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్ వి ఆదినారాయణరావు తరఫున ఆయన అర్ధాంగి శశిప్రభ హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ఆంధ్రా యూనివర్సిటీ  అంతర్జాతీయస్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించాలన్న తన కోరిక జోక్ లేదా మ్యాజిక్ కాదని అన్నారు. ఆంధ్ర యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని లోకేశ్ అన్నారు.

ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రత్యేకించి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో భవిష్యత్తులో ఏయూ ప్రపంచస్థాయి విద్యాసంస్థగా ఆవిర్భవించడం సాధ్యమేనని నమ్మకం వ్యక్తం చేశారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేసిన బలమైన పునాదికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరంతా మాతృ సంస్థ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అలూమ్నిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

ఏయూ నుంచి ఎందరో ప్రముఖులు

ప్రస్తుత విద్యార్థుల ఉన్నతికి మీ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సిఆర్ రావు, యుజిసి మాజీ వైస్ చైర్మన్ బిఆర్ రావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జిఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నీలి బెండపూడి, బీవిఆర్ మోహన్ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ సగ్గుర్తి వంటి ప్రముఖులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ వారసత్వానికి నిదర్శనం. 

అలూమ్ని ప్రముఖులు ముందుకు రావాలి

ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా ప్రపంచానికి ఎనలేని సేవలను అందించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఇటీవల సంవత్సరాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నది కాదనలేని సత్యం. NIRF యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2019లో 16వ స్థానంలో ఉండగా, 2024లో 25కి పడిపోయింది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో 29వ స్థానం నుండి 41వ స్థానానికి పడిపోయింది. 

యూనివర్సిటీకి గత వైభవాన్ని పునర్నిర్మించడానికి నేటి సమావేశం కీలకమైన అడుగుగా నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇందుకోసం అలూమ్ని ప్రముఖులంతా దృఢమైన సంకల్పంతో ముందుకురావాలని కోరుతున్నాను. అధునాతన ఆవిష్కరణలు, పరిశోధనల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీని ముందువరుసలో నిలిపేందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించండి. 

ఏయూ పూర్వవైభవానికి కట్టుబడి ఉన్నాం 

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గత వైభవాన్ని చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యాప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పాఠ్యాంశాలను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. 

అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు జరుగుతున్నాయి. దీనిద్వారా ఇక్కడి విద్యార్థులు అగ్రశ్రేణి అధ్యాపకులచే మార్గదర్శకత్వం పొందుతారు. విద్యాశాఖ మంత్రిగా KG నుండి PG వరకు సమూల ప్రక్షాళనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీతో గ్లోబల్ ఇంక్యుబేషన్ హబ్‌గా మార్చడానికి ఆంధ్రా యూనివర్సిటీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.


More Telugu News