వేములవాడలో కోడెల అక్రమ విక్రయం వార్తలపై స్పందించిన కొండా సురేఖ

  • కోడెలను విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్న మంత్రి
  • కోడెల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించామన్న మంత్రి
  • మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను ఇస్తున్నట్లు వెల్లడి
వేములవాడ దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని, ఈ వార్తలను ఖండిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో వాటిలో కొన్ని మరణించినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణకు విధివిధానాలను రూపొందించేందుకు మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, సంబంధిత మండల వ్యవసాయాధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్నామన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ చేపడుతోందన్నారు. కోడెలను అక్రమంగా విక్రయించారంటూ వచ్చిన వార్తలు వట్టివే అన్నారు.

సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచిస్తానని తెలిపారు. కోడెల పంపిణీకి వచ్చిన దరఖాస్తులను కూడా అలాగే పంపించామన్నారు. మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదన్నారు. దేవస్థానంలోని ప్రతి కోడెకు ట్యాగ్ ఉంటుందని, అలాంటి కోడెలు బయట ఎక్కడా దొరకలేదన్నారు. దీనిపై దేవస్థానం కూడా స్పష్టతనిచ్చిందన్నారు.


More Telugu News