2025 చివరకు సెన్సెక్స్ 1,05,000 పాయింట్లకు చేరుకోవచ్చు: మోర్గాన్ స్టాన్లీ

  • సెన్సెక్స్ కనీసం 93 వేల మార్క్ ను అధిగమిస్తుందన్న మోర్గాన్ స్టాన్లీ
  • పరిస్థితులు ప్రతికూలంగా మారితే 77 వేల పాయింట్లకు పడిపోవచ్చని వెల్లడి
  • అమెరికా, జపాన్, ఇండియన్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయన్న మోర్గాన్ స్టాన్లీ
భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దేశీయ కంపెనీల లాభాల జోరు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో మన మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వచ్చే ఏడాది (2025) చివరి నాటికి సెన్సెక్స్ ఏకంగా 1,05,000 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అంత స్థాయికి చేరుకోలేని పక్షంలో కనీసం 93 వేలను అధిగమిస్తుందని చెప్పింది. 

ఇదే సమయంలో... పరిస్థితులు ప్రతికూలంగా మారితే సెన్సెక్స్ 77 వేల పాయింట్లకు పడిపోవచ్చని తెలిపింది. అంతకంటే కిందకు పడే అవకాశం ఏమాత్రం లేదని పేర్కొంది. కార్పొరేట్ సంస్థల ఆదాయాల్లో వృద్ధి, ఈక్విటీ పెట్టుబడులు గణనీయంగా పెరగడం, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం వంటిని సెన్సెక్స్ పెరుగుదలకు దోహదపడతాయని చెప్పింది. 

ఇన్వెస్టర్లకు మోర్గాన్ స్టాన్లీ కొన్ని సూచనలు కూడా చేసింది. వచ్చే ఏడాదిలో సరైన కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెడితే లాభాలను ఆర్జించే వీలుంటుందని తెలిపింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, టెక్నాలజీ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జపాన్, భారత మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని వెల్లడించింది. ఐరోపా దేశాల్లో పెట్టుబడుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


More Telugu News