అన్ని మాయం అవుతున్నాయి.. జాగో తెలంగాణ: కేటీఆర్

అన్ని మాయం అవుతున్నాయి.. జాగో తెలంగాణ: కేటీఆర్
  • ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త‌ విగ్రహం ఆవిష్కరణ‌
  • నిన్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతం
  • ఈ విగ్ర‌హంపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన కేటీఆర్‌
తెలంగాణ త‌ల్లి కొత్త విగ్ర‌హ రూపంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నీ మాయం అవుతున్నాయంటూ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

"తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ మాయం. తల్లి కాళ్ల కడియాలు మాయం. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం. తెలంగాణ రైతుల భూములు మాయం. మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం. 

టీఎస్ లో ‘ఎస్’ మాయం. ఖజానాలో కాసులు మాయం. ఇలా మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి? ప్రజలకు ఒరిగిందేమిటి? జాగో తెలంగాణ" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

కాగా, తెలంగాణ తల్లి విగ్రహం నమూనా నిన్న (శుక్ర‌వారం) బహిర్గతమైంది. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది.

బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. కాగా, ఈ కొత్త న‌మూనాపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.  


More Telugu News