మీకు ఇంకా బుద్ధి రాలేదు.. సీఎంతో పెట్టుకునేంత స్థాయి మీకు లేదు: విజయసాయిరెడ్డిపై ఎంపీ నాగరాజు ఫైర్

  • కాకినాడ పోర్టులో అనేక అక్రమాలు చేశారన్న నాగరాజు
  • రాష్ట్రంపై విజయసాయి విషం కక్కుతున్నారని మండిపాటు
  • అరాచకాలన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్య
కాకినాడ పోర్టు సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా బెదిరించారని కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. దీనికి సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై పెట్టిన కేసును ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంతో పెట్టుకునేంత స్థాయి విజయసాయికి లేదని... తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. 

రాష్ట్రంపై విజయసాయి విషం కక్కుతున్నారని నాగరాజు మండిపడ్డారు. ఏపీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరికాదని నాగరాజు అన్నారు. వైసీపీ హయాంలో భారీగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారని నాగరాజు ఆరోపించారు. మీరు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయని... అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా... మీకు ఇంకా బుద్ధి రాలేదని చెప్పారు. మరో రెండు సీట్లు తగ్గి ఉంటే మీకు 'నవరత్నాలు' మాత్రమే మిగిలేవని ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టులో ఎన్నో అక్రమాలు జరిగాయని... నిదానంగా అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. 


More Telugu News