పాఠశాలలో విషాదం: ప్రహరీగోడ కూలడంతో రెండో తరగతి విద్యార్ధి మృతి

  • స్కూల్ ప్రహరీ కూలి బాలిక మృతి, మరో ఇద్దరికి గాయాలు
  • నంద్యాల జిల్లా నందికొట్కూరు విద్యానగర్‌లో ఘటన
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జయసూర్య
ప్రభుత్వ పాఠశాలలో విషాద ఘటన జరిగింది. పాఠశాల ప్రహరీగోడ కూలడంతో ఒక చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిన్న జరిగింది. పట్టణానికి చెందిన షాలుబాషా, రుక్సానా దంపతుల కుమార్తె అస్తమాహిన్ (7) విద్యానగర్ కాలనీలో గల ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.

బుధవారం పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత ఆయా నూర్జహాన్ గేటుకు తాళం వేసేందుకు ప్రయత్నించగా, ప్రహరీగోడ శిథిలావస్థకు చేరుకోవడంతో గేటు సరిగా పడలేదు. దీంతో రెండో తరగతి చదువుతున్న తబసుం, అజీద్‌లు ఆయాకు సాయంగా వెళ్లారు. పిల్లలతో కలిసి ఆయా గేటును బలంగా నెట్టడంతో గేటు, ప్రహరీ కూలిపోయాయి. ఆ సమయంలో ప్రహరీకి ఆనుకొని నిల్చున్న అస్తమాహిన్ పై గోడ శిథిలాలు పడ్డాయి. తబసుం, అజీద్‌లపై గేటు పడింది. 

ఈ ఘటనతో చిన్నారులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు, సమీపంలోని వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని పిల్లలపై పడిన శిధిలాలు, గేటును తొలగించారు. స్వల్పంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అస్తమాహిన్ తలపై నాపరాయి పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శిథిలావస్థకు చేరుకున్న ప్రహరీ గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. 

విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జయసూర్య, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్ధిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


More Telugu News