వైర‌ల్ వీడియో.. పాట పాడిన వినోద్ కాంబ్లీ.. స‌చిన్ రియాక్ష‌న్ ఇదే!

  • గురువు రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో కలుసుకున్న సచిన్, కాంబ్లీ
  • ఇద్దరూ అచ్రేకర్ శిష్యులే
  • ఈ కార్య‌క్ర‌మంలో పాట పాడిన కాంబ్లీ వీడియో వైర‌ల్‌
బాల్య స్నేహితులైన కాంబ్లీ, సచిన్ ఇద్దరూ తాజాగా ఒకే వేదికపై కలుసుకున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో తమ గురువు, కోచ్ రమాకాంత్ అచ్రేకర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ స్మారక చిహ్నం ఆవిష్కరణలో భాగంగా వీరిద్దరూ ఇలా క‌లుసుకోవ‌డం జ‌రిగింది. సచిన్, కాంబ్లీ ఇద్దరూ అచ్రేకర్ శిష్యులే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరూ రికార్డులు బద్దలుగొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి వెలుగులోకి వచ్చారు. ఇక సచిన్ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప్రపంచ దిగ్గజ క్రికెటర్ గా పేరు సంపాదించుకోగా, కాంబ్లీ మాత్రం కెరీర్‌ను చేతులారా నాశ‌నం చేసుకుని ఫెయిల్యూర్ క్రికెట‌ర్‌గా మిగిలిపోయాడు. 

ఇక ఇద్ద‌రి వ‌య‌సు కూడా దాదాపు అంతే ఉంటుంది. స‌చిన్‌కు 51 ఏళ్లు ఉంటే.. కాంబ్లీ వ‌య‌సు 52 ఏళ్లు. ఈ వ‌య‌సులో కూడా స‌చిన్ ఫిట్‌గా క‌నిపిస్తే.. కాంబ్లీ అత‌ని కంటే దాదాపు 15 ఏళ్లు పెద్ద‌వాడిలా క‌నిపిస్తున్నాడు. క‌నీసం త‌న‌కు తానుగా పైకిలేచి నిల‌బ‌డేందుకు కూడా కాంబ్లీ ఇబ్బంది ప‌డ‌డం క‌నిపించింది. అత‌ని మాట‌లు కూడా త‌డ‌బ‌డుతున్నాయి. 

అయితే, ఈ కార్య‌క్ర‌మంలో వినోద్‌ కాంబ్లీ ఓ పాట పాడిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ స‌మ‌యంలో స‌చిన్ రియాక్ష‌న్ వీడియోలో హైలైట్ అయింది. మిత్రుడు కాంబ్లీ అలా పాట పాడుతుంటే స‌చిన్ మొద‌ట ముభావంగా ఉండిపోయాడు. చివ‌రికి త‌న స్నేహితుడి కోసం చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం వీడియోలో ఉంది. 

ఇదిలాఉంటే..  ఇటీవల వైరల్ అయిన వీడియోలో వినోద్‌ కాంబ్లీ నడవడానికి కూడా ఇబ్బంది పడడం కనిపించింది. అయితే, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను కాంబ్లీ ఖండించాడు. తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.   


More Telugu News