కేసీఆర్ సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు!: రేవంత్ రెడ్డి

  • ఎకరాతో కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చో చెప్పాలని ఎద్దేవా
  • మేం మంచి పనులు చేస్తుంటే ఆశీర్వదిస్తే ఏమవుతుందన్న సీఎం
  • బీసీ కులగణనలో పాల్గొనని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపు
తన అనుభవంతో సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... 'కేసీఆర్ గారూ! శాసన సభకు వచ్చి మీ అనుభవాల్ని తెలంగాణ ప్రజలకు పంచండి' అంటూ సూచన చేశారు. ఒక ఎకరాతో కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చో ప్రజలకు తెలియజేయండని ఎద్దేవా చేశారు. ఆయన విద్య... ఆ రహస్యం ఏమిటో ఈ రోజుకూ అంతుచిక్కడం లేదన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని... మేం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనే దిగిపోండని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తమను ఐదేళ్లు పాలించాలని ఎన్నుకున్నారన్నారు. మేం మంచి పనులు చేస్తుంటే ఆశీర్వదించడానికి ఏమవుతుందన్నారు. తాము పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చామన్నారు. రామగుండంకు విమానాశ్రయం కూడా తీసుకు వస్తామన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనను.. ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మోదీ సీఎంగా, ప్రధానిగా ఒక ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ సభకు వచ్చి తన అనుభవాన్ని అందరికీ పంచాలన్నారు. బీసీ కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. బీసీలకు వ్యతిరేకమైతే చెప్పాలని నిలదీశారు. ఒక మంచి పని కోసం ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు సహకరించాలన్నారు. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సమాజం బహిష్కరించాలన్నారు.


More Telugu News