విధులను అడ్డగించి బెదిరించారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీస్ అధికారి ఫిర్యాదు

  • కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు మరో 20 మందిపై కేసు
  • ఫిర్యాదును స్వీకరించాకే బయటకు వెళ్లాలని సీఐని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం మధ్యాహ్నం విధులను అడ్డగించి.. బెదిరించారని ఇన్స్‌పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు మరో ఇరవై మందిపై కేసు నమోదైంది.

తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆయన వచ్చే సమయానికి సీఐ బయటకు వెళ్తున్నారు. అయితే తన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత వెళ్లాలని కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. అయితే తనకు అత్యవసర పని ఉందని, తిరిగి వచ్చాక ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించారని, తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. సీఐ పని మీద వెళ్తుండగా ఆయన కారును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.  


More Telugu News