ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫియా ద్వారా వైసీపీ దోచుకుంది: మంత్రి అనగాని ఆగ్రహం

  • జగన్, వైసీపీ నాయకులు భూసమస్యలు పెంచారని విమర్శ
  • ఎల్లుండి నుంచి సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని సూచన
ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫియా ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో జగన్, వైసీపీ నాయకులు భూసమస్యలు పెంచారని ఆరోపించారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో మంత్రి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎల్లుండి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అన్ని రకాల భూసమస్యలపై ఈ రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు సూచించారు. భూదురాక్రమణలు, 22ఏ భూముల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి సమస్యలు లేని పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతి నెలా రివ్యూ చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చాయని, దీంతో ఇప్పటికే నిర్వహించాల్సిన సదస్సులు వాయిదా పడ్డాయన్నారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు 17,564 గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో కొత్త రేషన్ కార్డులపై చర్చిస్తామన్నారు.


More Telugu News