బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం.. తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇంగ్లండ్

  • బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై పెచ్చుమీరుతున్న దాడులు
  • జన సమ్మర్థ ప్రాంతాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఉగ్రదాాడులకు ఆస్కారం ఉందని యూకే హెచ్చరిక
  • ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయి అరెస్ట్ తర్వాత దేశంలో హింసాత్మక ఘటనలు
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ తమ పౌరులకు యూకే హెచ్చరికలు జారీ చేసింది. జనసమ్మర్థ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మతపరమైన భవనాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

దేశద్రోహం ఆరోపణలతో గత నెల 25న ఇస్కాన్ ప్రచార కర్త చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి హిందూ సమాజంపై దాడులు పెచ్చుమీరాయి. అవి క్రమంగా హింసాత్మక రూపు దాల్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు యూకే పేర్కొంది. ఈ నేపథ్యంలో ముఖ్య నగరాల్లో ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. 

బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల జనాభాలో 8 శాతం మాత్రమే ఉన్న మైనార్టీలపై ఇటీవలి కాలంలో 200కుపైగా దాడులు జరిగాయి. చిన్మయిదాస్ అరెస్ట్ తర్వాత ఢాకా, చిట్టగాంగ్‌లలో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా భద్రతా దళాలకు వారికి మధ్య తోపులాట జరిగింది.


More Telugu News