పట్నం నరేందర్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు

  • క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు
  • లగచర్ల ఘటనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ నరేందర్ రెడ్డి పిటిషన్
  • కుదరదని తేల్చిచెప్పిన హైకోర్టు.. బెయిల్ పిటిషన్ ను పరిశీలించాలని కింది కోర్టుకు సూచన
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అయితే, కేసులోని మెరిట్స్ ఆధారంగా నరేందర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను పరిశీలించాలంటూ కింది కోర్టుకు సూచించింది. ఈమేరకు బుధవారం ఉదయం తీర్పు వెలువరించింది. 

లగచర్లలో ప్రభుత్వ అధికారులపై రైతుల దాడికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడి కుట్రలో నరేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద జాగింగ్ కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, లగచర్ల దాడి ఘటనకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. కేసు కొట్టేయలేమంటూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చింది.


More Telugu News