నాటకాన్ని రక్తికట్టించడం కోసం.. స్టేజిపైనే పందిని చంపి పచ్చి మాంసం తిన్న రాక్షస వేషధారి.. వీడియో ఇదిగో!

  • గంజాం జిల్లాలోని ఓ గ్రామంలో ఘటన
  • ‘కంజిఒవళా’ యాత్రలో భాగంగా నాటక ప్రదర్శన
  • కళాకారుల వికృత ప్రవర్తనపై సర్వత్ర విమర్శలు
  • రాక్షస పాత్రధారి, నిర్వాహకుడి అరెస్ట్
  • ఘటనను ఖండించిన అసెంబ్లీ
ఒడిశాలోని గంజాం జిల్లాలో వేసిన రామాయణ నాటక ప్రదర్శలో కళాకారులు వికృతంగా ప్రవర్తించారు. నాటకాన్ని రక్తికట్టించేందుకు స్టేజిపైనే మూగజీవాలను చంపి తిన్నారు. ‘కంజిఒవళా’ యాత్రలో భాగంగా ఓ గ్రామంలో ప్రదర్శించిన నాటకంలో కళాకారులు ఇలా వికృత పోకడలకు పోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రదర్శనలో భాగంగా వాలి, సుగ్రీవ వేషధారులు రెండు నాగుపాములతో స్టేజిపై ఆటలాడగా, రాక్షస వేషధారి మరింతగా చెలరేగిపోయాడు. నాటకాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు సజీవంగా ఉన్న ఓ వరాహాన్ని స్టేజిపై తలకిందులుగా వేలాడదీసి, కత్తితో దాని పొట్టచీల్చి పచ్చి మాంసాన్ని తినేశాడు. బతికున్న కోడిని నోటితో కొరికి చంపాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నాటక ప్రదర్శనపై విమర్శలు రావడంతో అసెంబ్లీలో పలువురు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తి ఖండించారు. మరోవైపు, పందిని చంపి మాంసం తిన్న రాక్షస వేషధారి బింబాధర గౌడ(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు పాములతో ఆటలాడిన కళాకారుల కోసం గాలిస్తున్నారు.


More Telugu News