బాలుడితో టీచర్ ప్రేమ, పెళ్లి.... వివరాలు ఇవిగో!

  • ఉత్తరాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌లో ఘ‌ట‌న‌
  • సోషల్‌ మీడియా ద్వారా ఏర్ప‌డిన‌ పరిచయం ప్రేమ‌గా మారిన వైనం
  • 16 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన 25 ఏళ్ల టీచ‌ర్‌
  • బాలుడి పేరెంట్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో బ‌య‌ట‌కు వచ్చిన వ్య‌వ‌హారం
ఇటీవల ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న మైన‌ర్‌ బాలుడితో టీచర్ ప్రేమాయణం ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఆమె వయస్సు 25 ఏళ్లు కాగా, బాలుడి వయసు 16 ఏళ్లు. ఆ ఇద్ద‌రికి సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్ప‌డింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్ర‌మంలో బాలుడి పేరెంట్స్‌కు తెలియకుండా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, విషయం తెలుసుకున్న బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్ర‌స్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అస‌లేం జ‌రిగిందంటే... 
రాష్ట్ర రాజ‌ధాని డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల యువతి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మీరట్‌కు చెందిన 16 ఏళ్ల ఓ బాలుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిద్ద‌రూ త‌మ‌ మొబైల్‌ నెంబర్లు మార్చుకున్నారు. అప్ప‌టి నుంచి తరచూ ఫోన్‌లలో మాట్లాడుకోవ‌డం చేశారు. దాంతో కొన్నిరోజుల‌కు వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

దాంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ టీచర్ బాలుడు ఉంటున్న‌ మీరట్‌కు వచ్చి త‌న‌ వెంట తీసుకెళ్లింది. బాలుడు మేజర్‌ అన్నట్లుగా న‌కిలీ ప‌త్రాలు సృష్టించి, ఘజియాబాద్‌లో అతడిని రిజిస్టర్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంది. వారి పెళ్లి విష‌యం బాలుడి పేరెంట్స్ తెలుసుకున్నారు. దాంతో వారు వెంట‌నే పోలీసులను ఆశ్రయించారు. 

కానీ మీరట్‌లోని లిసాడా గేట్‌ ఏరియా పోలీసులు వారి ఫిర్యాదును లైట్ తీసుకున్నారు. దాంతో బాధితులు చేసేదేమీలేక‌ మీరట్‌ అడిషనల్‌ డీజీ ధ్రువ్‌కాంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు లిసాడా గేట్‌ ఏరియాలో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News