భారత్-చైనా సంబంధాలపై లోక్ సభలో జైశంకర్ కీలక ప్రకటన

  • ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడి
  • 2020లో చైనా చర్యల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయన్న జైశంకర్
  • ఉద్రిక్తతలు తగ్గించడం కోసం నిరంతరం చర్చలు జరిపినట్లు వెల్లడి
భారత్-చైనా మధ్య సంబంధాలపై కేంద్రమంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు కొంత మెరుగయ్యాయన్నారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన చైనాతో సంబంధాలపై వివరణ ఇచ్చారు. 2020లో సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుందుడుకు చర్యల కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. నాడు కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మన సైన్యం చైనాను కట్టడి చేసిందన్నారు.

నిరంతర దౌత్య చర్యల ఫలితంగా ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు. 2020లో ఏప్రిల్-మే కాలంలో తూర్పు లఢఖ్ లోని పలు ప్రాంతాల్లో చైనా భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం ఘర్షణకు దారి తీసిందని లోక్ సభలో తెలిపారు. ఓ వైపు మన బలగాలతో చైనాకు దీటుగా స్పందిస్తూనే... మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించడం కోసం డ్రాగన్ కంట్రీతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని మన ప్రభుత్వం చైనాకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో మనకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.


More Telugu News