నేను ఎదుర్కొన్న గొప్ప బౌల‌ర్ బుమ్రా... ఈ విష‌యం నా మ‌న‌వ‌ళ్ల‌కు చెబుతా: ట్రావిస్ హెడ్‌

  • టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు
  • ఆసీస్ ప్లేయ‌ర్లు సైతం మ‌నోడిపై వ‌రుస‌పెట్టి పొగ‌డ్తల వ‌ర్షం కురిపిస్తున్న వైనం
  • క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప బౌల‌ర్ల‌లో ఒకడిగా బుమ్రా కెరీర్‌ను ముగిస్తాడ‌న్న‌ హెడ్
టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌స్తుతం ప్ర‌పంచ అత్యుత్త‌మ బౌలర్‌గా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లోనూ బుమ్రాను మించిన వ‌ర్త‌మాన పేస‌ర్ మ‌రొక‌రు లేరంటూ స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక‌ ఎప్పుడూ భార‌త ప్లేయ‌ర్ల‌ను పొగ‌డ‌ని ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు సైతం మ‌నోడిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. 

జ‌స్ప్రీత్ బుమ్రా లాంటి గొప్ప బౌల‌ర్‌ను ఎదుర్కొన్నాన‌ని తాను త‌న మ‌న‌వ‌ళ్ల‌కు చెబుతాన‌ని తాజాగా ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు. "బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయ‌డం అంత సులువేమీ కాదు. అత‌ని బౌలింగ్‌ను ఎదుర్కొవ‌డం అనేది ఎంతో స‌వాలుతో కూడుకుంది. కానీ త‌న‌తో ఆడ‌డం బాగుంటుంది.  

బుమ్రాతో ఆడే సిరీస్ ఏదీ బాగాలేదు అనిపించ‌దు. అత‌ణ్ని ఇంకా ఎక్కువ‌సార్లు ఎదుర్కోవాలి. కానీ ప్రతిసారీ అది స‌వాలుగానే అనిపిస్తుంది. ఇక ఒక‌సారి కెరీర్ ముగిశాక ఆలోచించుకుంటే.. నేను అత‌ణ్ని ఎదుర్కొన్నాను అని నా మ‌న‌వ‌ళ్ల‌కు చెప్పుకోడానికి చాలా బాగుంటుంది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప బౌల‌ర్ల‌లో ఒకడిగా బుమ్రా కెరీర్‌ను ముగిస్తాడు" అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. 


More Telugu News