రికార్డు సృష్టించిన పుష్ప‌2.. విడుద‌ల‌కు ముందే ప్ర‌భంజ‌నం!

  • బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 ల‌క్ష‌ల‌ టిక్కెట్ బుకింగ్స్‌ 
  • తొలిరోజు రూ.50 కోట్ల వ‌సూళ్ల మార్క్‌ను దాటేసిన పుష్ప‌2
  • ఈ నెల 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో అత్యంత వేగంగా 10 ల‌క్ష‌ల‌ టిక్కెట్ బుకింగ్స్‌ అయ్యాయి. అంతేగాక‌ ఈ సినిమా తొలిరోజు రూ.50 కోట్ల క‌లెక్ష‌న్ల‌ మార్కును కూడా దాటేసింది. Sacnilk తాజా గణాంకాల ప్రకారం పుష్ప2 మొదటి రోజు ఇప్పటికే రూ. 50 కోట్లు రాబట్టింది. ఇందులో వివిధ భాషలలో ఇండియా వ్యాప్తంగా 21,000 షోల ద్వారా వ‌చ్చిన‌ రూ. 35.75 కోట్ల నికర వ‌సూళ్లు ఉన్నాయి. 

ఇక పుష్ప 2 థియేట్రికల్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం ప్రతి రోజు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కేజీఎఫ్‌ చాప్టర్2, కల్కి 2898 ఏడీ, బాహుబలి2 వంటి చిత్రాల‌ మునుపటి రికార్డులను అధిగమించింది. 

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంగీత హక్కులను టి-సిరీస్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా రూ.1085 కోట్ల బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూ. 640 కోట్లకు అమ్ముడయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కూడా భారీ ధ‌ర‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.


More Telugu News