రాంగ్ షాట్ ఫలితం.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్.. వీడియో ఇదిగో!

  • బీహార్‌లోని మాధేపురాలో ఘటన
  • బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లిన అదనపు కలెక్టర్ శిశిర్ మిశ్రా
  • తనతో ఆడాలని ఆటగాళ్లను పదేపదే బతిమాలిన అధికారి
  • రాంగ్‌షాట్‌కు కోపగించి ఆటగాడిని చితకబాదిన మిశ్రా
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ఆటగాడిపైనా దాడి
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్
తనతో ఆడేందుకు నిరాకరించిన బ్యాడ్మింటన్ ఆటగాళ్లను బీహార్‌లోని మాధేపురా జిల్లా అదనపు కలెక్టర్ శిశిర్ కుమార్ మిశ్రా వెంబడించి మరీ భౌతిక దాడికి పాల్పడ్డారు. రాకెట్‌ను నేలకేసి కొట్టి ముక్కలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను మిశ్రా కొట్టిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నప్పటికీ అవి నిరాధార ఆరోపణలని, అలాంటిదేమీ జరగలేదని చెప్పడం గమనార్హం. మరోవైపు, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తరణ్‌జోత్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఆయన నివాసం సమీపంలోని బీపీ మండల్ ఇండోర్ స్టేడియంలో చోటుచేసుకుంది. 

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ప్లేయర్లు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఈ క్రమంలో మిశ్రా మూడో ప్లేయర్‌‌ను వెంబడిస్తూ రాకెట్‌ను ఆయనపై విసరడం కనిపించింది. అతడు కోర్టును విడిచిపెట్టేంత వరకు మిశ్రా వెంబడించారు. ఇండోర్ స్టేడియానికి వెళ్లిన మిశ్రా అప్పటికే అక్కడ ఆడుతున్న ప్లేయర్లను తనతో ఆడాలని కోరారు. వారు అప్పటికే గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ అలసిపోయి ఉండడంతో ఆయనతో ఆడేందుకు నిరాకరించారు. అయితే, మిశ్రాతోపాటు ఆయనతో ఉన్నవారు పదేపదే ఒత్తిడి చేయడంతో చివరికి ఓ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించారు. 

ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుండగా ఓ ప్లేయర్ రాంగ్ షాట్ కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మిశ్రా ఆ ఆటగాడిపై భౌతిక దాడికి దిగడమే కాకుండా రాకెట్‌తో వెంబడించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఆటగాడిని లాగిపడేసి దాడిచేశారు. దీంతో అతడి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటగాళ్లపై దాడికి పాల్పడిన అదనపు కలెక్టర్ మిశ్రా అక్కడితో ఆగకుండా రాకెట్‌ను విరిచేశారు. మరోసారి ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, నివేదికను బట్టి చర్యలు ఉంటాయని కలెక్టర్ తరణ్‌జోత్ తెలిపారు. 


More Telugu News